Type Here to Get Search Results !

Satavahana Dynasty Evidences - శాతవాహనుల చరిత్రకు ఆధారాలు

Satavahana Dynasty Evidences - శాతవాహనుల చరిత్రకు ఆధారాలు శాతవాహనుల చరిత్రకు సంబంధించిన ఆధారాలు. ఈ పోస్ట్ లో శాతవాహనులు సంబందించిన సాహిత్య ఆధారాలు , పురావస్తు ఆధారాలు, వారికి సంబంధించిన కట్టడాలు, నాణెములకు సంబంధించిన ఆధారాలు గురించి చర్చించడం జరిగింది.

శాతవాహనుల చరిత్రకు ఆధారాలు

ఆంధ్ర శబ్దం ప్రథమంగా ఐతరేయ బ్రాహ్మణంలో కన్పిస్తుంది. మత్స్య, వాయు, విష్ణు, భాగవతాది పురాణాల్లో సైతం ఆంధ్రుల ప్రస్తావన ఉంది. బౌద్ధ సాహిత్యమైన భీమసేన జాతకం ఆంధ్ర పదాన్ని ప్రస్తావిస్తే, సెరివణిజ జాతకం ఆంధ్ర నగరిని పేర్కొంది. వీటితోపాటు అశోకుడి 13వ శిలాశాసనం కూడా ఆంధ్రుల గురించి ప్రస్తావించింది. గ్రీకు రచయిత మెగస్తనీస్ ఇండికా గ్రంథంలో ఆంధ్రులకు 30 కోటలతో గొప్ప సైనిక బలముందని పేర్కొన్నాడు. ప్లినీ.. లాటిన్ భాషలో రచించిన ‘నేచురల్ హిస్టరీ’లో మెగస్తనీస్ పేర్కొన్న అంశాలనే ఉటంకించాడు. అజ్ఞాత రచయిత రచించిన ‘పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రిన్ సీ’ గ్రంథం శాతవాహనుల విదేశీ వాణిజ్య వివరాలను తెలుపుతోంది.

1. మత్స్య, వాయు, బ్రహ్మాండ, భాగవత పురాణాలు.
2. శర్వవర్మ రాసిన సంస్కృత వ్యాకరణ గ్రంథం- కాతంత్ర వ్యాకరణం.
3. ప్రాకృత భాషలో హాలుడు రచించిన గాథాసప్తశతి.
4. ఆచార్య నాగార్జునుడు సంస్కృత భాషలో రచించిన సుహృల్లేఖ, ప్రజ్ఞాపారమిత వంటి గ్రంథాలు.
5. మెగస్తనీస్ (గ్రీకు రచయిత) ఇండికా.
6. టోలమీ రచించిన ‘ఎ గైడ్ టు జాగ్రఫీ’
7. హ్యుయాన్‌త్సాంగ్ రచించిన సీయూకీ
8. అజ్ఞాత రచయిత ‘పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రిన్ సీ’
9. ఎర్రగుడి, రాజుల మందగిరి (కర్నూలు జిల్లా), మస్కి (రాయచూర్)ల్లో అశోకుడు వేయించిన శిలా శాసనాలు.
10. మొదటి శాతకర్ణి భార్య ‘నాగానిక’ వేయించిన నానాఘట్ శాసనం.
11. గౌతమీ పుత్ర శాతకర్ణి తల్లి ‘గౌతమీ బాలశ్రీ’ వేయించిన నాసిక్ శిలా శాసనం.
12. రెండో శాతకర్ణి సమకాలికుడైన కళింగాధిపతి ఖారవేలుడు వేయించిన హాతిగుంఫా శిలాశాసనం (ఒడిశా).
13. శక రాజైన రుద్రదమనుడు మొదటిసారిగా సంస్కృత భాషలో వేయించిన గిర్నార్ శాసనం.

సాహిత్య ఆధారాలు

పురాణాలు: పురాణాలు శాతవాహన రాజుల పేర్లను తెలుపుతున్నాయి. పురాణాలు వీరిని ఆంధ్రభృత్యులని పేర్కొన్నాయి. వాయు, విష్ణు, భాగవత పురాణాలు శాతవాహన రాజుల సంఖ్యను 30గా పేర్కొన్నాయి. మత్స్యపురాణం వీరి సంఖ్య 29 అని, 460 ఏండ్లు పరిపాలించారని పేర్కొంది.

వాత్సాయనుడి కామసూత్ర: వాత్సాయనుడు కామసూత్రాల్లో కుంతల శాతకర్ణి రాజును పేర్కొన్నారు. సోమదేవుడు రాసిన కథాసరిత్సాగరంలో సాత యక్షుని వాహనంగా కలవాడే శాతవాహనుడని పేర్కొన్నాడు.
బాణుడు రాసిన హర్షచరిత్రలో శాతవాహన రాజు నాగార్జుని మిత్రుడని యజ్ఞశ్రీ శాతకర్ణి త్రిసముద్రాదీశ్వరుడు అని పేర్కొన్నాడు.

ఆచార్య నాగార్జునుడు తను రాసిన సుహృల్లేఖ (స్నేహితునికి లేఖ) గ్రంథంలో శాతవాహన రాజైన యజ్ఞశ్రీ శాతకర్ణి గురించి ప్రస్తావించారు.

కుతూహలుడు ప్రాకృతంలో రాసిన లీలావతి పరిణయంలో హాల చక్రవర్తి తన సైన్యాన్ని తూర్పు భాగానికి తీసుకొని వెళ్లాడని పేర్కొంది. అంతేగాక హాలుని వివాహం సప్త గోదావరి తీరాన జరిగిందని తెలిపింది. ఈ సప్త గోదావరి ప్రాంతం ప్రస్తుతం జగిత్యాల జిల్లాలోని వేంపల్లి వెంకట్రావ్ పేటగా చరిత్రకారులు గుర్తించారు.

మెగస్తనీస్ తన ఇండికా గ్రంథంలో ఆంధ్రులు మంచి శక్తిమంతులని, వారికి 30 కోటలు ఉన్నాయని, లక్ష పదాతిదళం ఉన్నదని పేర్కొన్నాడు.

పురావస్తు ఆధారాలు

నానాఘాట్ శాసనం: మొదటి శాతకర్ణి భార్య దేవి నాగానిక ఈ శాసనాన్ని వేయించింది. ఇది అలంకార శాసనం. దీనిపై తొలి శాతవాహన రాజుల ప్రతిమలు చెక్కి ఉన్నాయి. ఈ శాసనంవల్ల మొదటి శాతకర్ణికి వీర, శూర, అప్రతిహత చక్ర, దక్షిణాపథపతి బిరుదులు ఉండేవని, ఇతడు రెండుసార్లు అశ్వమేథ యాగం చేశాడని తెలుస్తుంది.

నాసిక్ శాసనం: ఈ శాసనాన్ని శాతవాహన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి తల్లి గౌతమీబాలశ్రీ తన
మనుమడైన వాసిష్టీపుత్ర పులోమావి 19వ పాలనా సంవత్సరంలో వేయించింది. ఈ శాసనం గౌతమీపుత్ర శాతకర్ణి సాధించిన విజయాలను, ఘనతలను తెలుపుతుంది. క్షత్రియ దర్పమాణమర్దన, ఏకబ్రాహ్మణ, త్రిసముద్రతోయపీతవాహన మొదలైన బిరుదులు శాతకర్ణికి ఉన్నాయని ఈ శాసనం తెలుపుతుంది.

జునాఘడ్, గిర్నార్ శాసనం: క్షాత్రప రుద్రదాముడు వేయించిన ఈ శాసనంలో యజ్ఞశ్రీ శాతకర్ణిని రుద్రదాముడు రెండుసార్లు ఓడించి తనకు సన్నిహిత బంధువైనందున విడిచిపెట్టినట్లు పేర్కొన్నాడు.

హాథిగుంఫా శాసనం: ఈ శాసనాన్ని ఖారవేలుడు వేయించాడు. దీనిలో మొదటి శాతకర్ణి రాజ్యమైన కన్న బెన్నపై దాడిచేసినట్లు తెలిపాడు.

కట్టడాలు, నాణేలు

కొండాపూర్: ఇది మెదక్ జిల్లాలో ఉంది. శాతవాహనులకు చెందిన సుమారు 4000 నాణేలు ఇక్కడ లభించాయి. సదవాహన, గౌతమీపుత్ర శాతకర్ణి, వాసిష్టీపుత్ర శాతకర్ణి, పులోమావి, యజ్ఞశ్రీ శాతకర్ణి నాణేలు ఇందులో ఉన్నాయి. కొండాపూర్‌ను శాతవాహనుల టంకశాల నగరమని మల్లంపల్లి సోమశేఖరశర్మ వ్యాఖ్యానించారు. మెగస్తనీస్ పేర్కొన్న ఆంధ్రుల 30 కోటల్లో ఇది ఒకటి.

కోటిలింగాల: ప్రస్తుత జగిత్యాల జిల్లాలోని గోదావరి, పెద్దవాగు సంగమ స్థానంలో ఉంది. ఇక్కడ జరిపిన తవ్వకాల్లో శాతవాహనుల కోటగోడలు, ఒక బురుజు బయటపడ్డాయి. ఇక్కడ శాతవాహనుల్లో మొదటి రాజైన శ్రీముఖుని నాణేలు, శాతవాహనుల పూర్వపు రాజుల నాణేలు దొరికాయి. శాతవాహనుల సామ్రాజ్యానికి ఇది తొలి రాజధాని.

పెద్దబొంకూరు: ప్రస్తుతం పెద్దపల్లి జిల్లాలో ఉంది. ఇక్కడ 22 వేలకు పైగా ఉన్న శాతవాహనుల నాణేలకుండ, వీరి కాలంనాటి 3 ఇటుక కోటల అవశేషాలు, ఇటుకలతో నిర్మించిన 22 చేదబావులు బయటపడ్డాయి. ఇక్కడ రోమన్ చక్రవర్తులైన ఆగస్టస్, సీజర్, టైబిలియస్ నాణేలు కూడా దొరికాయి.

ధూళికట్ట: పెద్దపల్లి జిల్లాలో ఉంది. ఇక్కడ జరిపిన తవ్వకాల్లో శాతవాహనుల కాలంనాటి బౌద్ధస్థూపం బయల్పడింది. దీన్ని మట్టికోటగా పిలుస్తున్నారు. కోటలోపల రాజభవనాలు, బావులు, ధాన్యాగారాలు మొదలైన అవశేషాలు బయటపడ్డాయి.

శాతవాహనులు వాడిన నాణెములు 

శాతవాహనులు రాగి, సీసం, తగరం, వెండి లోహాలతో అనేక పరిమాణాల్లో నాణేలను ముద్రించారు. ఈ నాణేలను కర్షాపణం, పథకం, ప్రతీక, సువర్ణం అనే పేర్లతో పిలిచేవారు. ఈ నాణేలు కొన్ని అండాకృతిలో, కొన్ని చతురస్రంగా ఉన్నాయి. 
  • వీటిలో సువర్ణం అనేది బంగారు నాణెం. 
  • కర్షాపణం వెండి నాణెం. 
  • 35 కర్షాపణ నాణేలు ఒక సువర్ణంతో సమానం.
శాతవాహనుల నాణేలపై సింహం, ఏనుగు, చైత్యం, గుర్రం, త్రిరత్న, వృషభం, స్వస్తిక్, ఉజ్జయినీ, నందిపాద, ఢమరుకం, అంకుశం, కమలం, శంఖం, సూర్యకిరణాలను ప్రసరిస్తున్న సూర్యుడు, ఈదుతున్న చేపలు వంటి చిహ్నాలు ఉన్నాయి.

శాతవాహనులు వాడిన కొన్ని నాణెములు:
గౌతమీ పుత్ర యజ్ఞ శ్రీ శాతకర్ణి నాణెం
రాష్ట్రంలోని కోటిలింగాల, పెద్దబంకూరు, కొండాపూర్, ధూళికట్ట మొదలైన ప్రాంతాల్లో అనేక శాతవాహనుల నాణేలు బయల్పడ్డాయి. ఈ నాణేలపై సిరి, చిముఖశాత అనే వ్యాఖ్యలు ఉన్నాయి.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.